కింగ్ కోఠి ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ముగ్గురు మృతి
తెలంగాణలో కరోనా పరిస్థితులు అందుబాటులోనే ఉన్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీగానే ఉన్నాయి. ఆక్సిజన్ అందుబాటులో ఉంది. ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది. మరోవైపు వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. కరోనా రోగులకి మందులు అందడం లేదు. ఆక్సిజన్ అందక వివిధ ఆసుపత్రుల్లో రోగులు ప్రాణాలు విడుస్తున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని కింగ్ కోఠి ఆస్పత్రిలో సమయానికి ఆక్సిజన్ అందక ముగ్గురు బాధితులు మృతి చెందారు. ప్రాణవాయువు లేక 2 గంటలుగా 20 మంది రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు నిర్లక్ష్యం చూపారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రికి ఆక్సిజన్ రవాణా ఆలస్యమైందని, అందుకే సమయానికి అందించలేకపోయామని అధికారులు చెబుతున్నారు. మరీ.. దీనిపై ఆల్ ఈజ్ వెల్ అని చెప్పుకొంటున్న సీఎం కేసీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.