ముచ్చటగా మూడోసారి వాయిదా
వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడే కరువైన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అధ్యక్ష ఎన్నికలను హస్తం పార్టీ వాయిదా వేసింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించకూడదని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) నిర్ణయించింది. సోమవారం సోనియాగాంధీ నేతృత్వంలో సీడబ్ల్యూసీ కమిటీ సమావేశమైంది.ఈ భేటీలో అధ్యక్ష ఎన్నికల అంశం చర్చకు వచ్చింది. జూన్ 23న ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ సిఫార్సు చేసింది.
2017లో పెట్టిన అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికై పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో హస్తం పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా తిరిగి పార్టీ పగ్గాలు చేపట్టారు.
గతేడాది ఆగస్టులో అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని భావించినప్పటికీ.. మరో ఆరునెలల పాటు సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగించాలని సీడబ్ల్యూసీ కమిటీ నిర్ణయించింది. ఆ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో సారథిని ఎన్నుకోవాలని అనుకోగా.. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా మరోసారి వాయిదా వేశారు. ఇప్పుడు జూన్లో నిర్వహించాలని కాంగ్రెస్ ఎన్నికల సంఘం సూచించినా.. కొవిడ్ వల్ల మూడోసారి వాయిదా పడింది.