కేటీఆర్ నోట కూడా ‘ఆల్ ఈజ్ వెల్’

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ కీలక సమావేశం బుధవారం సచివాలయంలో జరిగింది. కమిటీ ఛైర్మన్‌, మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన జరిగినఈ భేటీలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌తో పాటు కమిటీ సభ్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా పరిస్థితులు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. అందరి సహకారంతో కరోనా గండం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాం. తెలంగాణలో తీవ్రత తగ్గిందని కేంద్ర మంత్రి కూడా చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు నియంత్రణలో ఉన్నాయి. సాధ్యమైనంత వేగంగా ప్రజలను బయటపడేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇంటింటి సర్వే, హోం ఐసోలేషన్ కిట్లతో విలువైన ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడింది. ప్రతి రోజూ ఆక్సిజన్ ఆడిటింగ్ జరుగుతోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇటీవల మీడియా ముందుకొచ్చిన సీఎస్ సోమేష్ కుమార్ చెప్పినట్టుగానే ఆల్ ఈజ్ వెల్ అని కేటీఆర్ కూడా చెప్పుకొచ్చారు.

కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద కరోనా టెస్టుల కోసం జనాలు క్యూలు కడుతున్నారు. తెల్లవారుజామున 5గంటలకే వచ్చి క్యూలో నిలబడుతున్నారు. డాక్టర్లు వచ్చేది మాత్రం ఉ॥10గంటల తర్వాతే. వాళ్లు చేసే టెస్టులు 50 నుంచి 75 వరకు మాత్రమే. క్యూలో నిలబడే జనాలు మాత్రం వందల్లో ఉంటున్నారు. అలాంటప్పుడు మంత్రి కేటీఆర్ ఆల్ ఈజ్ వెల్ అని ఎలా చెబుతారు ? కొంచెం వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మీడియా ముందు మాట్లాడితే మంచిదేమో.. !