మాస్క్‌ పెట్టుకో.. వ్యాక్సిన్‌ తీసుకో.. చిరు సలహాలు

మెగాస్టార్ చిరంజీవి సామాజిక సృహ తెలిసిన వ్యక్తి. ఆయన ముందు నుంచి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభిస్తున్న వేళ.. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించే చిరు ప్రయత్నం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వీడియో సందేశాలు ఇస్తున్నారు. తాజాగా చిరు పలు కోవిడ్ సలహాలు, సూచనలు చేశారు. అవి ఆయన మాటాల్లోనే… 

“కరోనా రెండో దశ చాలా తీవ్రంగా ఉంది. చాలా మంది కరోనా బారినపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కోలుకోవడానికి కూడా చాలా సమయం పడుతోంది. మన ఆత్మీయుల్లో కొందర్ని ఈ వైరస్ వల్ల కోల్పోతున్నామంటే గుండె తరుక్కుపోతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ విధించారు. కనీసం ఇప్పుడైనా అలక్ష్యం చేయకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇంటి నుంచి బయటకు రాకండి. ఒక వేళ రావాల్సి వస్తే, తప్పనిసరిగా మాస్క్‌ ధరించండి. అవసరమైతే డబుల్‌ మాస్క్‌ ధరించండి

లాక్‌డౌన్‌లోనూ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. వాక్సినేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పుడు వీలైతే అప్పుడు టీకా వేయించుకోండి. వ్యాక్సినేషన్ తీసుకున్నా కరోనా వచ్చినా దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కరోనా బారినపడితే భయపడవద్దు. వైరస్ కంటే మన భయమే ముందు మనల్ని చంపేస్తుంది. పాజిటివ్‌ అని తెలియగానే మిమ్మల్ని మీరు ఐసోలేట్‌ చేసుకుని ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉండండి. నిరంతరం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకుంటూ మందులు వాడండి.

ఊపిరి తీసుకోవడంలో ఏమాత్రం సమస్య అనిపించినా, ఇబ్బంది కలిగినా వైద్యులను సంప్రదించి ఆస్పత్రిలో చేరండి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నెల రోజుల్లో యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అవుతాయి. ప్లాస్మా దానం చేస్తే కరోనా నుంచి ఇద్దరిని కాపాడవచ్చు. ఈ విపత్తు సమయంలో ఈ విషయాలు వీలైనంత మందికి సాయం చేయండి. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని, మన ఊరిని మన దేశాన్ని రక్షించుకుందాం. సురక్షితంగా ఉండండి. ధన్యవాదాలు” అని చిరు చెప్పుకొచ్చారు.

#Covid19IndiaHelp #StayHomeStaySafe #WearMask 😷 #DontPanic #GetVaccinated #DonatePlasmaSaveLives 🙏🙏
Lets #DefeatCorona 👊 pic.twitter.com/g1ysqxmPJR— Chiranjeevi Konidela (@KChiruTweets) May 14, 2021