విభ‌జ‌న హామీలు నెర‌వేర్చండి.. ఆర్థిక సాయం చేయండి..

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో స‌మావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీకి ప‌లు విజ్ఞాప‌న‌లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.20వేల కోట్ల ఆర్థిక సాయం అందించాలని కేసీఆర్‌ మోదీని కోరారు. తెలంగాణలో జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వచ్చిందని, దీనికి అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాలని కోరారు. హైకోర్టు విభజన ఇప్పటికీ పూర్తి కాలేదని, దీనిపై జోక్యం చేసుకుని తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు అయ్యేలా చూడాలన్నారు. భద్రాచలం రోడ్-సత్తుపల్లి కొత్త రైల్వే లైను నిర్మించాలని కోరారు. కాజీపేట-విజయవాడల మధ్య విద్యుద్దీకరణతో కూడిన మూడో లైను నిర్మాణం, రాఘవాపురం-మందమర్రి మధ్య మూడో లైను నిర్మాణం, ఆర్మూర్-నిర్మల్-ఆదిలాబాద్ మధ్య బ్రాడ్ గేజ్ లైన్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్-మహబూబ్ నగర్, సికింద్రాబాద్-జహీరాబాద్ రైల్వే లైన్లను డబుల్ లేన్‌గా మార్చడానికి, హుజురాబాద్ మీదుగా కాజీపేట-కరీంనగర్ మధ్య రైల్వే లైను నిర్మించడానికి అవసరమైన సర్వే నిర్వహించాలని కోరారు.

హైదరాబాద్‌లో కొత్త సచివాలయం నిర్మాణంపై కూడా కేసీఆర్‌ చర్చించారు. బైసన్ పోలో గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని ఇప్పటికే రక్షణ శాఖను కోరామని, ఆ స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని అన్నారు.    విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని తొమ్మిది వెనుకబడిన జిల్లాల (ఉమ్మడి జిల్లాలు) అభివృద్ధికి ఒక్కో జిల్లాకు ఏడాదికి 50 కోట్ల రూపాయల చొప్పున 450 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించాల్సి ఉందని, కానీ, 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగవ విడత ఆర్థిక సహాయం ఇంకా విడుదల కాలేదని చెప్పారు. అవి విడుదల చేయాలని కోరారు.

తెలంగాణకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)ను మంజూరు చేయాలని కోరారు. కేంద్ర సర్కారు 2013 సంవత్సరంలో హైదరాబాద్‌కు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజన్(ఐటిఐఆర్) మంజూరు చేసిందని, ఈ ప్రాజెక్టుకు నిధులిచ్చి, హైదరాబాద్‌లో ఐటిఐఆర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు. అలాగే, కరీంనగర్ పట్టణంలో ఐఐఐటీ స్థాపించాలని కోరారు. తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో కూడా నవోదయ విద్యాసంస్థలను నెలకొల్పాలని కోరారు.