RRR.. జైలు టు హాస్పటల్ !
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణం రాజును తరలించాలని సీఐడీ కోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పటికీ, పోలీసులు ఆయనను రిమాండ్ కు తరలించడానికి ప్రయత్నించారు. పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య జిల్లా జైలుకు తరలించారు. ఎవరూ ఊహించని విధంగా గుంటూరు జీజీహెచ్ వెనక గేటు నుంచి ఆయన్ను జైలుకు తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో రఘురామకృష్ణంరాజు సతీమణి రమాదేవి మీడియా ముందుకొచ్చారు. తన భర్తను ఇవాళ జైలులో చంపడానికి పోలీసులు కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కడప నుండి కొందరు వ్యక్తులు ఈ కుట్రలో భాగంగా చేరుకున్నారని తమకు సమాచారం ఉందని ఆమె అన్నారు. రమేష్ ఆస్పత్రికి తరలించాలని సిఐడి కోర్టు ఇచ్చిన ఆదేశాలను పోలీసులు పట్టించుకోకపోవడం- ఇది ఏం ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.
అయితే ఇంతలో రఘురామ కృష్ణంరాజు శరీరంపై గాయాలకు సంబంధించి వైద్య నివేదిక జిల్లా కోర్టు నుంచి ప్రత్యేక మెసెంజర్లో హైకోర్టుకు అందింది. దీంతో హైకోర్టు విచారణ చేపట్టింది. సీఐడీ కోర్టు ఆదేశాలను పోలీసులు పాటించాలని, రఘురామకృష్ణంరాజు ని తక్షణమే జైలు నుండి రమేష్ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.