జిల్లాకో మెగా ఆక్సిజ‌న్ బ్యాంక్ !

కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో మెగాస్టార్ చిరంజీవి పెద్దన్న పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. సిసిసి సంస్థని స్థాపించి సినీ కార్మికులని ఆదుకున్నారు. ఐతే సెకండ్ వేవ్ లో మెగాస్టార్ సలైంట్ అయ్యారు. ఆయన నుంచి ఎలాంటి సాయం ప్రకటన రాలేదు. అసలు టాలీవుడ్ స్టార్స్ ఈ సారి పైసా తీయలేదు. కేవలం కరోనా జాగ్రత్తలు మాత్రమే చెబుతున్నారు. చేతులు కడుక్కోండి.. మూతులు తూడుచుకోండని మాత్రమే చెబుతున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శలు మొదలయ్యాయ్. సటైర్స్ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గొప్ప స్టెప్ తీసుకున్నారు. ప్ర‌తీ జిల్లాలోనూ ఓ ఆక్సిజ‌న్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని చిరు నిర్ణయం తీసుకున్నారు. జిల్లాకో ఆక్సిజ‌న్ బ్యాంక్ అంటే మాట‌లు కాదు. చాలా ఖ‌ర్చుతో కూడుకున్న వ్య‌వ‌హారం. కాస్త ఆల‌స్య‌మైనా..  ఓ మంచి నిర్ణ‌యం తీసుకున్న చిరుని అభినందించి తీరాలి. స్టార్లు ట్విట్ట‌ర్‌లో మాట‌ల‌తో పులిహోర క‌ల‌ప‌డం త‌ప్ప‌, ఇంకేం చేయ‌డం లేద‌ని, సోనూసూద్ లాంటి వాళ్ల‌ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఈ మ‌ధ్య విమ‌ర్శ‌లు ఎక్కువ‌య్యాయి. వాటికి అన్నింటికి చిరు చేతలతో సమాధానం చెప్పినట్టయింది. త్వరలోనే జిల్లాకో మెగా ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు కాబోతుంది.