కఠిన లాక్‌డౌన్‌ సమస్యలపై సీఎం కేసీఆర్ ఫోకస్

తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఉండదని చెబుతూ వచ్చారు సీఎం కేసీఆర్. ఆఖరుకు లాక్‌డౌన్‌ విధించక తప్పలేదు. మొదట పదిరోజులే లాక్‌డౌన్‌ విధించినా.. ఆ తర్వాత దాన్ని ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. లాక్‌డౌన్‌ వలన మంచి ఫలితాలు వస్తున్నాయ్. అందుకు పొడిగించినట్టు తెలిపారు. ఐతే ఇటీవల లాక్‌డౌన్‌ ని కఠినంగా అమలు చేయాలని.. ఉదయం 10:10 తర్వాత ఎవరు బయట కనిపించినా.. వారి వాహనాలని సీజ్ చేయాలని సీఎం కేసీఆర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. 

ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలని సీజ్ చేసి.. జనాలని బంధీ చేస్తున్నారు. ఆ సమయంలో సామాజిక దూరం పాటించడం లేదు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. దీంతో.. ప్రభుత్వంపై నెగటివ్ టాక్ వినిపిస్తోంది. తాజాగా దీనిపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టినట్టున్నారు. సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. 

ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హాజరయ్యారు. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేసిన నేపథ్యంలో ఎదురవుతున్న సమస్యలపై సీఎం అధికారులతో చర్చించనున్నట్లు సమాచారం.