జుడాల డిమాండ్లకు ప్రభుత్వం ఓకే.. సమ్మె విరమణ ?
తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. పెంచిన స్టయిఫండ్, ప్రోత్సాహకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూడాలు సమ్మెకు దిగారు. ఐతే కరోనా విపత్కర పరిస్థితుల్లో జూడాలు సమ్మెకు పిలుపునివ్వడం సరికాదని సీఎం కేసీఆర్ అన్నారు. జూడాల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే గౌరవ వేతనం 15 శాతం పెంచాలని ఆయన నిర్ణయించారు. మూడేళ్ల వైద్య విద్యతో కొవిడ్ విధుల్లో ఉన్న వారికి గౌరవ వేతనం పెంచాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) రమేశ్ రెడ్డితో జూడాలు భేటీ అయ్యారు. ప్రస్తుతం సమావేశం కొనసాగుతోంది. అనంతరం సమ్మెని విరమించేది.. కొనసాగించే దానిపై జుడాలు ప్రకటన చేయనున్నారు.