ముస్లింల రిజ‌ర్వేష‌న్ పెంపుపై ప్ర‌ధానిని అడ‌గ‌లేదేం..?

ఢిల్లీలో ప్ర‌ధాని మోదీని క‌లిసిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. రాష్ట్ర విభ‌జ‌న సమ‌యంలో ఇచ్చిన హామీల‌పై ప్ర‌ధాని వ‌ద్ద ప్ర‌స్తావించ‌డ‌క‌పోవ‌డమేంట‌ని సీఎల్పీ నేత జానారెడ్డి ప్ర‌శ్నించారు. కేంద్ర విశ్వవిద్యాలయం, హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన రాయితీలు తదితర హామీలు కేంద్రం విస్మ‌రించింద‌న్నారాయ‌న‌.

ఒక్క రామగుండం విద్యుత్ పనులు మొదలుపెట్టడం త‌ప్ప మిగ‌తా హామీల ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌డి అక్క‌డే అన్న చందంగా ఉంద‌న్నారు జానారెడ్డి. ముస్లిం లకు 12శాతం రిజర్వేషన్ పై సీఎం కెసిఆర్ నిన్న ప్రధానిని ఎందుకు అడగలేదని ప్ర‌శ్నించారు. కనీసం నీతి ఆయోగ్ లోనైనా ఈ విషయాన్ని సీఎం కెసిఆర్ అడగాల‌న్నారు. ఈ విషయాల్లో కేంద్ర ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం చేసే కృషికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.