బలం, బలగం చూపించిన ఈటెల

గులాభి పార్టీకి గుడ్ బై చెప్పేశారు ఈటెల రాజేందర్. టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు మీడియా ముఖంగా ప్రకటించారు. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. 19 ఏళ్ల తెరాస అనుబంధానికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కేసీఆర్‌ ధర్మాన్ని నమ్ముకుంటే.. ఇప్పుడు డబ్బు అణచివేతలను నమ్ముకున్నారని విమర్శించారు.

కుట్రలు, కుతంత్రాలతో తాత్కాలికంగా విజయం సాధించొచ్చు. ఆత్మగౌరవం, బాధ్యతలేని మంత్రి పదవి అవసరం లేదని చెప్పా. ప్రగతి భవన్‌ కాదు.. బానిసల నిలయంగా పెట్టుకోవాలని చెప్పా. సీఎంవోలో ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు. ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఆర్థికమంత్రి ఉండరు. దరఖాస్తు అందించి ఫొటో దిగేందుకు కూడా టీఎన్జీవోలకు అనుమతి ఇవ్వలేదన్నారు.

ఓ వైపు సీఎం కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేస్తూనే.. మరోవైపు ఈటెల బలం. బలగం చూపించారు. తన కోసం తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ నుంచి వందలాది మంది తరలివచ్చారు. నాతో పాటు తెరాసకు రాజీనామా చేశారని.. వారిని పేరు పేరున పరిచయం చేశారు. అయితే భాజాపాలో చేరడం ఎప్పుడు ? అన్నది మాత్రం ఈటెల స్పష్టతనివ్వలేదు. బీజేపీ వర్గాలు మాత్రం వారంలోగానే ఈటెల కమల తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నరు.