ఉద్యమక్షేత్రంగా కరీంనగర్

హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. తెరాసకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. కమలాపూర్‌ మండలంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ధర్మానికి, అధర్మానికి మధ్య సంగ్రామం జరగనుందన్నారు. కొంతమంది వ్యక్తులు తొత్తులుగా మారి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అపనిందలతో అవమానిస్తే రాజకీయంగా బుద్ధి చెబుతామన్నారు. హుజూరాబాద్‌ నుంచే మరో ఉద్యమానికి నాంది పలుకుతామని ఈటల చెప్పారు. సింహగర్జనకు కరీంనగర్‌ ఎలా తొలిపలుకు పలికిందో.. నేడు హుజూరాబాద్‌ కూడా ఆత్మగౌరవ పోరాటానికి, అణగారిన వర్గాల హక్కుల కోసం ఉద్యమక్షేత్రంగా మారనుందని చెప్పారు.