26న రాజ్‌భవన్ల ముట్టడికి రైతుల పిలుపు
కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు గతేడాది నవంబరు 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించి ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమానికి ఏడు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 26న ‘రాజ్‌భవన్ల ముట్టడి’కి రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఆ రోజున అన్ని రాష్ట్రాల్లోని గవర్నర్ల నివాసాలైన రాజ్‌భవన్‌ల ముందు ధర్నాలు చేపడతామని వెల్లడించాయి. నల్లజెండాలతో ధర్నాలో పాల్గొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రాలను పంపిస్తామని సంయుక్త కిసాన్‌మోర్చా నాయకుడు ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.
“1975 జూన్ 26న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడూ అలాంటి పరిస్థితే నెలకొంది. ఇది అప్రకటిత ఎమర్జెన్సీ. ఆ రోజు నాటికి మేం ఉద్యమం చేపట్టి 7 నెలలు పూర్తికావస్తుంది. అందుకే ఆ రోజును సేవ్ ఫార్మింగ్, సేవ్ డెమొక్రసీ (వ్యవసాయాన్ని కాపాడుదాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం) డేగా పాటించాలని నిర్ణయించాం” అని ఇంద్రజిత్ సింగ్ తెలిపారు.