హైపర్ ఆదికి తీవ్ర హెచ్చరికలు

తెలంగాణ సంస్కృతిపై జబర్థస్త్ నటుడు హైప‌ర్ ఆది దాడి చేయ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. ఈ నెల 13న ఆదివారం ఈటీవీలో ప్ర‌సార‌మైన ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ అనే కార్యక్రమంలో బతుకమ్మ, గౌరమ్మ, తెలంగాణ భాష, యాస‌ను కించపరిచేలా మాట్లాడారనేది ఇష్యూ. దీనిపై ఎల్బీ న‌గ‌ర్ ఏసీపీ శ్రీ‌ధ‌ర్‌రెడ్డికి తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడ‌రేష‌న్ ఫిర్యాదు చేసింది. ఆదితో పాటు స్క్రిప్ట్‌ రైటర్‌, మల్లెమాల ప్రొడక్షన్‌పై కూడా ఫిర్యాదు చేశారు.

ఈ నేప‌థ్యంలో తెలంగాణ జాగృతి ఫెడ‌రేష‌న్ స‌భ్యులు మీడియా సాక్షిగా హైప‌ర్ ఆదికి ఫోన్ చేసి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెప్పాల‌ని, లేని ప‌క్షంలో న్యాయ‌ప‌రంగా కేసు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. హైప‌ర్ ఆది స్పందిస్తూ … తాను కేవ‌లం న‌టుడిని మాత్ర‌మేన‌ని చెప్పాడు. స్క్రిప్ట్ తాను రాయ‌లేద‌ని చెప్పుకొచ్చాడు.

ఆ కార్య‌క్ర‌మం జ‌రిగే స‌మ‌యానికి స్టేజి మీద 20 మంది వ‌ర‌కు ఆర్టిస్టులు ఉన్నార‌న్నాడు.  ఎవ‌రి పాట వారు పాడుకుంటున్నార‌ని తెలిపాడు. ఆ ప్లోలో ఏదైనా మిస్టేక్ జ‌రిగి ఉంటే తెలంగాణ వాళ్ల‌కు బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ చెబుతాన‌న్నారు. ఐతే ఆది మాటలు బాధ్యతారాహితంగా ఉన్నాయని తెలంగాణ వాదులు అంటున్నారు.