నిర్లక్ష్యమే కొంపముంచింది

దేశంలో రెండోసారి కరోనా విజృంభించడానికి కారణం ఏంటీ ? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని.. సాధారణ మానవుడి మాట. తొలి వేవ్ సమయంలో చూపిన ముందు చూపు సెకండ్ వేవ్ సమయంలో కరువైంది. తొలివేవ్ నుంచి గుణపాఠాలు నేర్చుకోలేదు. వైద్య సదుపాయాలని మెరుగు పరుచులేదు. ఆక్సిజన్ నిల్వల్లేవ్. అందుకే.. ఇన్ని చావులు అని సామాన్యుడు ఆగ్రహం చూపిస్తున్నాడు. అయితే కేంద్రం దృష్టిలో మాత్రం ఇది ప్రజల నిర్లక్ష్యం వలనే జరిగింది.

ప్రజలు నిబంధనల విషయంలో నిర్లక్ష్యంగా ఉండటమే వైరస్ రెండోదశకు దారితీసిందని తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ అన్నారు. ఆరోగ్యశాఖలో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి మాస్కులు పంపిణీ చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొవిడ్ నియమావళిని ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడంతో వైరస్ వ్యాప్తి చెందింది. వాటికి కొత్త రకాలు తోడయ్యాయి. ఇవన్నీ కలిసి రెండో దఫా ఉద్ధృతికి దోహదం చేశాయి హర్షవర్ధన్‌ అన్నారు. ప్రజల, ప్రభుత్వాల మాటలెలా ఉన్నా.. రెండో వేవ్ విలయానికి నిర్లక్ష్యమే కారణం. మూడో వేవ్ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు పాటిద్దాం. మనల్ని మనం కాపాడుకుందాం. సమాజాన్ని కాపాడుదాం.