వరల్డ్ బుక్’లో ఆనందయ్య పేరు
ప్రపంచ దేశాలను గడగడ వణికించింది కరోనా మహమ్మారి. ఒకటి కాదు రెండు సార్లు. గత యేడాదిన్నరగా కరోనా భయంతో ప్రజలు బిక్కు బిక్కున బతుకుతున్నారు. ఈ మహమ్మారికి వాక్సిన్ తేవడానికి దాదాపు యేడాది పట్టింది. దాన్ని ప్రజలందరికీ అందించేందుకు మరో యేడాది పట్టేలా ఉంది. ఇలాంటి సమయంలో కరోనాకు మందుకనిపెట్టారు కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. కరోనా వాక్సిన్ కంటే ముందే తన మందుని అందించి ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు. ఆయన సేవలని గుర్తించి వరల్డ్ బుక్ లో చోటు ఇవ్వనున్నారు.
ఆనందయ్యకు తమ సంస్థ ద్వారా త్వరలో వరల్డ్‌బుక్‌లో చోటు కల్పిస్తున్నట్లు ఇంటర్నేషనల్ బ్రాహ్మిన్స్ పార్లమెంట్(ఐబీపీ) రాష్ట్ర కార్యదర్శి దినవహి వెంకటనాగరాజ ప్రసాద్ ప్రకటించారు. ఆదివారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలుకు వచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ఆయన కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆనందయ్య చేస్తున్న సేవలను ఐబీపీ గుర్తించిందన్నారు. త్వరలోనే ఆనందయ్యకు వరల్డ్ బుక్ లో చోటి కల్పిస్తున్నట్టు తెలిపారు.
ఇక ప్రభుత్వ అనుమతితో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆనందయ్య మందును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పక్క రాష్ట్రాలు కూడా ఆనందయ్య మందు కావాలని అడుగుతున్నారు. కానీ మొదట సొంత నియోజకవర్గం, ఆ తర్వాత ఏపీ మొత్తం.. ఆ తర్వాతే పక్క రాష్ట్రాలు అనే ఫార్ములాతో ఆనందయ్య మందు పంపిణీ జరుగుతున్నట్టు తెలుస్తోంది.