కలెక్టర్ అయినా.. కాళ్లు మొక్కాల్సిందేనా ?
కాళ్లు మొక్కడం, కాళ్లు లాగడం వంటివి రాజకీయాల్లో జరుగుతుంటాయ్. అయితే అధికారులు, అందులోనూ కలెక్టర్ లాంటి కీలక హోదాలో ఉన్న వాళ్లకు కాళ్ల మీద పడటం, కాళ్లు మొక్కడం లాంటివి వంగి వంగి చేయాల్సిన పనులుండవ్. అయితే ఆదివారం సీఎం కేసీఆర్ పర్యటనలో ఇద్దరు కలెక్టర్లు కూడా కాళ్లకు నమస్కరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఆదివారం సీఎం కేసీఆర్ సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల కలెక్టరేట్ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల కలెక్టర్లు సీఎం కేసీఆర్ కాళ్లకు నమస్కరించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. కలెక్టర్ అయినా.. సీఎం కాళ్లు పట్టుకోవాల్సిందేనా ? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.
ఈ వ్యవహారంపై సిద్దిపేట కలెక్టర్ వెంకటరామిరెడ్డి స్పందించారు. శుభకార్యం వేళ పెద్దల ఆశీస్సులు తీసుకోవడం తెలంగాణ సంప్రదాయమని, దీనికి తోడు ఆదివారం ఫాదర్స్ డే కూడా కావడంతో కేసీఆర్ను తండ్రిలా భావించి ఆశీస్సులు తీసుకున్నట్టు చెప్పారు. బహుశా.. కామరెడ్డి కలెక్టర్ ది కూడా సేమ్ ఫీలింగ్ అయి ఉంటుందేమో.. !