ఆ అంశంపై విస్తృత చర్చ జరగాలన్న ప్రధాని..!
ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన నాల్గవ నీతిఆయోగ్ పాలకమండలి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలు, సలహాలు భవిష్యత్తు విధాన నిర్ణయాలలో పరిగణలోకి తీసుకుంటామని, రాష్ట్రాలు సూచించిన అంశాలపై మూడునెలలలోగా చర్యలు తీసుకోవాలని నీతి ఆయోగ్ ను ప్రధాని ఆదేశించారు. నీతి ఆయోగ్ అభివృద్ది చేయాల్సిన 115 జిల్లాలను గుర్తించినట్లుగా రాష్ట్రాలు కూడా 20 శాతం బ్లాకులను గుర్తించేందుకు ప్రమాణాలను నిర్దేశించుకోవచ్చని మోదీ చెప్పారు.
పంట విత్తడానికి ముందు కోత తరువాత వరకు వ్యవసాయ మరియు ఉపాధి హామీ అనుసంధానంపై సమన్వయ విధానాన్ని అనుసరించేందుకు సిఫారసులు చేసేలా ఆంధ్రప్రదేశ్,బెంగాల్,ఉత్తరప్రదేశ్,మధ్యప్రదేశ్, బీహార్,సిక్కిం, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను మోదీ కోరారు. 115 జిల్లాలలో 45 వేల గ్రామాలకు ఏడు కీలక పధకాలను 2018 ఆగస్టు 15 కల్లా చేర్చడానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. ఎటువంటి వివక్ష లేకుండా సమతుల్యతతో ప్రభుత్వ పధకాలను అందించడమే సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యమని తెలిపారు.
త్వరలో భారత ఆర్ధిక వ్యవస్ధ ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేరబోతుందని, రాష్ట్రాలు సొంతంగా పెట్టుబడుల సదస్సు ను నిర్వహించుకోవడం సంతోషకరమని ప్రధాని అన్నారు. సులభతర వాణిజ్యంకోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నీతిఆయోగ్ ను కోరారు. లోక్ సభ మరియు అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపే అంశంపై విస్తృత చర్చ జరగాలని, తద్వారా ఆర్ధిక వనరులు పొదుపు చేసుకుంటూ ఖర్చు తగ్గించుకుంటూ వనరులను సమర్ధ వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని మోదీ అభిప్రాయపడ్డారు.