‘మా’ వ్యూహాలు.. మాములుగా లేవ్ !
‘మా’ ఎన్నికల హడావుడి మొదలైంది. ఆ హీట్ సడెన్ గా మొదలైనట్టు అనిపిస్తోంది. కానీ మూడు నెలల ముందు నుంచి ప్లాన్ జరిగినట్టు తెలుస్తోంది. మా అధ్యక్ష పదవి బరిలో నిలబడేందుకు ప్రకాష్ రాజ్ మూడు నెలల నుంచే సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకు వకీల్ సాబ్ ప్రమోషన్స్ బాగా వాడుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ఉన్నసైద్దాంతిక విబేధాలను తొలగించుకున్నారు. ఆ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి అనుమతిని తీసుకున్నారు. అటు టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయ్. ఇక తనకు ఎదురేలేదు. తదుపరి మా అధ్యక్షుడు తానే అనుకున్నారు. కానీ ప్రత్యర్థి వర్గం వ్యూహాలు కూడా మూడ్నెళ్ల క్రిందటే మొదలయ్యాయని బహుశా.. ఆయనకు తెలీదు.
సిట్టింగ్ అధ్యక్షుడు నరేష్ కూడా ముందుగానే పావులు కదిపినట్లు తెలుస్తోంది. తన వర్గానికి చెందిన రెండు వందల మంది చేజారకుండా నరేష్ చూసుకుంటూ వచ్చారు. కరోనా టైమ్ లో వారిని ఎలా ఆదుకోవాలో.. అలా ఆదుకున్నారు. తన కేండిడేట్ ని ప్లాన్ చేసుకుంటున్న టైమ్ లో మంచు విష్ణుకి ఆసక్తి ఉందని తెలిసి.. ఆ దిశగా పావులు కదిపారు. మంచు విష్ణుని సడెన్ గా తెరపైకి తీసుకొచ్చారు.
సీనియర్లు కృష్ణ, కృష్ణంరాజులను విష్ణు కలవడం వెనుక వ్యూహం నరేష్ దే అని తెలిసింది. ప్రకాష్ రాజుకి మెగాస్టార్ ముందే హామీ ఇచ్చినా.. మంచు విష్ణుకు నో చెప్పలేని పరిస్థితి అతనిది. పైగా ప్రకాష్ రాజ్ కు నాన్ లోకల్ కార్డ్ మైనస్ గా మారుతోంది. లోకల్ కార్డ్ మంచు విష్ణుకి కలిసిరానుంది. ఇవన్నీ పక్కనపెడితే.. కిందిస్థాయి నటీనటులతో ప్రకాష్ రాజ్ అంత సన్నిహితంగా ఉండరు. ఓటింగ్ లో పాల్గొనేది ఎక్కువగా కిందిస్థాయి నటీనటులే. అది మంచు విష్ణుకి ప్లస్ కానుంది.
అయితే తన వ్యూహాలు తనకు ఉ న్నాయ్. ఈసారి అధ్యక్ష పీఠం నాదే అనే ధీమాతో ఉన్నారు. బహుశా.. ఆయనది రాజకీయ ధీమా కావొచ్చు. మంత్రి కేటీఆర్, తెరాస ప్రభుత్వం నుంచి ఆయన నరుక్కుంటూ రావొచ్చని చెబుతున్నారు. మొత్తానికి.. ఈసారి మా ఎన్నికలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠగా జరిగేలా కనిపిస్తున్నాయ్.