థర్డ్ ప్రంట్ ప్రయత్నాలు.. అన్నీ ఉత్తవే !
ఇటీవల రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ తో రెండు సార్లు భేటీ కావడం ప్రాధాన్యతని సంతరించుకుంది. మిషన్ 2024 పేరుతో భాజపాను ఉమ్మడిగా ఎదుర్కోవాలన్న లక్ష్యంతో అన్ని పక్షాలను ఏకం చేసే పనిని మొదలెట్టారనే వార్తలు వినిపించాయి. ఇందులో భాగంగానే ఈరోజు పవార్ ఇంట్లో ప్రతిపక్షాల భేటీ జరుగుతుందని చెప్పుకున్నారు. అయితే ఈ ప్రచారం అంతా ఉత్తిదేనట. ఈ సమావేశం థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కాదట.
అది మూడో కూటమి భేటీ కాదని, రాష్ట్ర మంచ్ సమావేశానికి పవార్ అధ్యక్షత వహిస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ట్విట్ చేశారు. ఈ రాష్ట్రమంచ్ను 2018లో యశ్వంత్ సిన్హా, శతృఘ్న సిన్హా స్థాపించారు. రాజకీయ నాయకులతో పాటు పలు రంగాల ప్రముఖులు కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. వీరు తరచూ సమావేశాలు నిర్వహిస్తుంటారు.
ఈ భేటీపై ప్రశాంత్ కిశోర్ కూడా స్పందించారు. శరద్ పవార్ అధ్యక్షతన జరిగే సమావేశంలో తాను పాల్గొనట్లేదని వెల్లడించారు. అంతేగాక, ప్రస్తుత పరిస్థితుల్లో భాజపాను ఎదుర్కొనేందుకు మూడు, లేదా నాలుగో కూటమి సాధ్యపడుతుందని తాను విశ్వసించట్లేదని చెప్పారు. దీంతో కొద్దిరోజులుగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై వస్తున్న వార్తలు ఉత్తవే అని తేలిపోయింది.