రోజుకి7.7 టీఎంసీల నీటిని అక్రమంగా తరలిస్తారు

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం ప్రారంభం అయింది. కొద్దిరోజులుగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అది అక్రమ ప్రాజెక్ట్ అని, ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ ని నీటి గజదొంగ అంటూ తిట్టిపోస్తున్నారు. వైఎస్ ఆర్ ని కూడా వదలడం లేదు. ఆయన దొంగ, ఆయన తనయుడు జగన్ గజదొంగలా మారాడని విమర్శిస్తున్నారు. మరోవైపు ఏపీ నేతలు మాత్రం ఆ దూకుడు చూపించడం లేదు. 

తెలంగాణ నేతలు ఎంత తిట్టిపోసినా.. సంయమనం పాటిస్తున్నారు. నెమ్మదిగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నట్టున్నారు. తాజాగా తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఏపీ ప్రాజెక్టులు అక్రమం అని మరోసారి ఘోషించారు. ఆయా ప్రాజెక్టులు అక్రమం కాబట్టే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్మాణాలు ఆపేయాలని ఆదేశించిందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాజెక్టు సాయంతో రోజుకు 7.7 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ, పాలమూరు, ఖమ్మం ప్రాంతాల రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతారని అన్నారు.