హైకోర్టులో జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వివాదం..!!
జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడి వ్యవహారం కోర్టుకు చేరింది. స్వర్గీయ పి.జనార్ధన్ రెడ్డి చొరవతో నిర్మితమైన జూబ్లిహిల్స్ పెద్దమ్మ ఆలయం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. కోరిన కోర్కెలు తీర్చే పెద్దమ్మతల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య అంతకంతకూ పెరుగతూ వస్తోంది. అదే స్థాయిలో ఆలయ అభివృద్ధి జరిగింది. తాజాగా ఈ ఆలయానికి ట్రస్ట్ బోర్డు అంశం వివాదంగా మారింది. పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డుఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ భావించింది.
ట్రస్టుబోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ దివంగత పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ధర్మకర్తలుగా తమ కుటుంబం ఉండగా, ట్రస్టు ఎలా ఏర్పాటు చేస్తారని విష్ణు తన వాదన కోర్టుకు వినిపించారు. దీంతో పెద్దమ్మ గుడి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించింది.