రేవంత్ రెడ్డి తొలి అడుగు.. హిట్టు !

ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడుని ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. మొదటి నుంచి వినిపిస్తున్న రేవంత్ రెడ్డి పేరునే ఖరారు చేసింది. ఇక అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వేసిన తొలి అడుగు… వెళ్లి సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలని కలిశారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాదు.. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి సోదరులను, వీహెచ్‌ను కలుస్తానని రేవంత్‌ తెలిపారు. అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు.

ఇక్కడే రేవంత్ రెడ్డి తొలి విజయం సాధించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇస్తే.. ఆయన ఎవ్వరి మాట వినడు. సీనియర్లని అసలే దేకడు అనే ప్రచారం ఉంది. దానికి పీసీసీ అధ్యక్షుడిగా తొలి అడుగుతోనే చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.ఇక తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని.. బడుగు బలహీన వర్గాలు, అమరవీరుల ఆశయాల కోసం పనిచేస్తామని పీసీసీ హోదాలో తొలిసారిగా చెప్పారు. బీజేపీ-టీఆర్ ఎస్ ఒక్కటే. అసలు ఈటెలని బీజేపీలోకి పంపిందే సీఎం కేసీఆర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మొత్తానికి.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అప్పుడే రాజకీయం మొదలు పెట్టారు. ఇకపై తెలంగాణలో త్రిముఖ పోరు ఖాయం. బీజేపీ, తెరాసలకు ధీటుగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ వ్యూహాలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపై కాంగ్రెస్ నుంచి వలసలు పోయి.. చేరికలు మొదలవుతాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.