మోడీ మంత్రివర్గ విస్తరణ.. వీరికి అవకాశం !

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గంలో భారీగా మార్పులు, చేర్పులు చేయవచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 27 మంది నేతల పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి కారణమైన జ్యోతిరాదిత్య సింధియాకు కేబినెట్‌ హోదా ఖాయంగా కనిపిస్తోంది. బిహార్‌ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీని కూడా మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.

రాజస్థాన్‌కు చెందిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, పశ్చిమ బెంగాల్‌ భాజపా ఇన్‌ఛార్జి, మధ్యప్రదేశ్‌కు చెందిన కైలాశ్‌ విజయవర్గీయ, భాజపా అధికార ప్రతినిధి, మైనారిటీ నేత సయ్యద్‌ జాఫర్‌ ఇస్లామ్‌లకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అసోం నుంచి మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌, మహారాష్ట్ర నుంచి మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణె, మహారాష్ట్రలోని బీడ్‌ ఎంపీ ప్రీతమ్‌ ముండే పేర్లను నాయకత్వం పరిశీలిస్తోంది.

వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం లభించనుంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌ సింగ్, మహారాజ్‌గంజ్‌ లోక్‌సభ సభ్యుడు పంకజ్‌ చౌదరి, వరుణ్‌ గాంధీ, ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షమైన అప్నాదళ్‌ అధ్యక్షురాలు అనుప్రియ పటేల్‌లకు అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఒడిశా నుంచి లోక్‌సభ సభ్యుడు అశ్విని వైష్ణవ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వైజయంత్‌ పండా, రాజ్యసభ సభ్యుడు అనిల్‌ జైన్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన రైల్వే శాఖ మాజీ మంత్రి దినేష్‌ త్రివేది పేరు కూడా ఈ జాబితాలో ఉండే అవకాశముంది. మోదీ ప్రభుత్వం-1లో మంత్రిగా పని చేసిన రాజస్థాన్‌కు చెందిన పీపీ చౌదిరిని మళ్లీ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. రాజస్థాన్‌లోని చరు ఎంపీ రాహుల్‌ కాశ్వాన్, సికార్‌ ఎంపీ సుమేదానంద సరస్వతి పేర్లను నాయకత్వం పరిశీలిస్తోంది.  దిల్లీ ఎంపీ మీనాక్షి లేఖికి అవకాశం లభించే సూచనలు ఉన్నాయి.

బిహార్‌ నుంచి లోక్‌ జనశక్తి నాయకుడు, దివంగత నేత రామ్‌ విలాస్‌ పాసవాన్‌ సోదరుడు పశుపతి పారస్‌కు అదృష్టం వరించవచ్చు. జేడీయూ నుంచి ఆర్‌సీపీ సింగ్, సంతోష్‌ కుమార్‌ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజీవ్‌ చంద్రశేఖర్‌కు అవకాశం దక్కనుంది.  గుజరాత్‌ భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్, అహ్మదాబాద్‌ పశ్చిమ ఎంపీ కిరీట్‌ సోలంకీ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం.

హరియాణా నుంచి సిర్సా ఎంపీ సునీతా దుగ్గల్‌ రేసులో ఉన్నారు.  లద్దాఖ్‌ ఎంపీ జమయంగ్‌ సెరింగ్‌ నమ్‌గ్యాల్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలు, వాణిజ్యం, న్యాయ, వ్యవసాయం, విద్య, పౌర విమానయానం, ఆహార శుద్ధి వంటి శాఖల్లో మార్పులు ఉండొచ్చని సమాచారం. అంతగా ప్రభావం చూపని కొందరు మంత్రులను తొలగించి కొత్తవారిని తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.