రేవంత్ మున్నూరు పాట

తెలంగాణ భాజాపా బీసీ కార్డుతో వెళ్తోంది. బీసీలకు పెద్దపీఠ వేస్తోంది. ఇంకా చెప్పాలంటే మున్నూరు పాట పాడుతోంది. పార్టీలో మున్నూరు కాపు, ముదిరాజులకి పెద్దపెట్ట వేస్తోంది. తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు కీలక నేతలు.. అదే సామాజిక వర్గానికి చెందినవారే. మొన్న దుబ్బాకలో బీజేపీ గెలుపులోనూ బీసీ కార్డ్ బాగా పనిచేసింది. అక్కడ మున్నూరు, ముదిరాజ్ లని ఏకం చేయడంలో బండి సంజయ్ విజయం సాధించారని విశ్లేషకులు చెప్పారు.

తెలంగాణ పీసీసీ పదవి కూడా బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. కానీ అందుకు తగ్గ అర్హత గల బీసీ నాయకుడు కాంగ్రెస్ అధిష్టానానికి కనబడలేదు. వీహె పీసీసీ పదవి ఆశించినా.. వయసు దృష్ట్యా ఆయన కనీసం పోటీలో కూడా నిలవలేకపోయారు. గతంలో పొన్నాల లక్ష్మయ్యకు పీసీసీ పదవి ఇచ్చినా.. ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో రెడ్ల రాజ్యంలో రేవంత్ రెడ్డిని ఎంపిక చేశారు. దాని పట్ల సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.

ఇప్పుడు వారిని కలిసి మచ్చిక చేసుకొనే పనిలో కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్నారు. పీసీసీ పదవిపై అధికారిక ప్రకటన రాగానే.. రేవంత్ వెళ్లి సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలని కలిశారు. ఇవాళ కూడా రేవంత్ సీనియర్లని కలిసే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం పొన్నాల లక్ష్మయ్యని కలిశారు. మరికొద్దిసేపట్లో వీహెచ్ హనుమంతరావుని కలవబోతున్నారు. వీరిద్దరు కూడా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారే. పొన్నాల రేవంత్ రెడ్డిని బాగానే రిసీవ్ చేసుకున్నారు. కానీ వీహెచ్ రియాక్షన్ ఎలా ఉండనుంది ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.