కాంగ్రెస్ సీనియర్లు దారికొచ్చారు
గత కొన్నేళ్లుగా తెలంగాణ కాంగ్రెస్ కు సీనియర్ల భయం పట్టుకుంది. పీసీసీ పోస్ట్ రేవంత్ రెడ్డికి ఇస్తే గనుక తమ దారి తాము చూసుకుంటామని అధిష్టానానికి సీనియర్లు హెచ్చరికలు పంపారు. దాంతో కొత్త పీసీసీ చీఫ్ ప్రకటన విషయంలో అధిష్టానం జాప్యం చేసింది. దాదాపు రెండేళ్ల పాటు సాగదీసింది. ఆఖరికి రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేశారు. దీంతో సీనియర్లు ఏం అఘాత్యం చేసుకుంటారో.. ఏ పార్టీలో చేరుతారో .. ఎంత గందరగోళం సృష్టిస్తారో.. ? అన్న చర్చ జరిగింది.
అనుకున్నట్టుగానే ఎంపీ కోమట్ రెడ్డి అధిష్టానం, రేవంత్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఆ తర్వాత తగ్గినట్టు కనిపిస్తోంది. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటా.. కానీ ప్రజాసేవ చేస్తానని ఆయన చెబుతున్నారు. రెండు ఒక్కటే కదా.. ! అని జనాలు అంటున్నారు. మొన్నటిలా ఇకపై ఏ విషయంపై బయటికి మాట్లాడను, తన పనేదో తాను చేసుకుంటా అనే సంకేతాలని ఆయన బయటికి పంపుతున్నారు. దీంతో.. వెంకట్ రెడ్డి కోపం తగ్గిపోయింది. ఆయన దారిలోకి వచ్చేసినట్టే అనుకుంటున్నారు.
ఇక రేవంత్ రెడ్డి పేరు చెబితేనే ఎగిరిపడే వీహెచ్ ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. ఆయన్ని ఆసుపత్రికి వెళ్లి కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పరామర్శించారు. దూరం ఉన్నప్పుడు చూపించిన కోపం దగ్గరికి వెళ్లాక లేదని స్పష్టం అయింది. అంతేకాదు.. రేవంత్ కు వీహెచ్ కొన్ని విలువైన సూచనలు, సలహాలు కూడా చేశారట. కలిసి సోనియమ్మ దగ్గరకు వెళదామని కూడా అన్నారట. ఇక మిగిలిన జగ్గారెడ్డి, పొన్నాల, దామోదర ఎప్పుడో చల్లబడ్డారు. రేవంత్ తో కలిసి పనిచేసేందుకు ఉత్సాహం కూడా చూపిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు దారికొచ్చారని చెప్పుకొంటున్నారు.