జల వివాదం.. షర్మిల నిరాహార దీక్ష డిమాండ్ !

జగనన్న బాణం తెలంగాణలోకి దూసుకొచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ప్రకటించిన వైఎస్ షర్మిల.. కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు. అందుకు కసరత్తు కూడా ప్రారంభించారు. పార్టీ జెండా-అజెండా ప్రకటించ ముందే తెలంగాణలోని నిరుద్యోగ సమస్యపై నిరాహార దీక్ష కూడా చేశారు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు ? అంటూ సీఎం కేసీఆర్ సర్కారుని నిలదీశారు. వెంటనే ఉద్యోగ ప్రకటన జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల కోసం పోరాడుతున్నట్టు హడావుడి చేశారు. ఆ తర్వాత సలైంట్ అయిపోయారు.

అప్పుడప్పుడు మీడియా ముందుకొచ్చి .. నేను ఉన్నాను. నేను వస్తున్నా.. అంటూ సంకేతాలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదంపై షర్మిల స్టాండ్ ఏంటీ ? అన్నది స్పష్టత ఇవ్వడం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన షర్మిల..  తెలంగాణకు సంబంధించిన ఒక్క నీటి చుక్కను వదులుకోబోమని.. అవసరం అయితే ఎవరితో అయినా పోరాడటానికి సిద్ధమని ప్రకటించారు.

ఎవరితో అయినా పోరాటం కాదు.. అక్కడ ఏపీ సర్కార్‌తో పోరాడాల్సి ఉంది. ఆ విషయం షర్మిలకు… ఆమె పార్టీ నేతలకు తెలియదా ? అంటూ తెలంగాణ ప్రజలు మండిపడుతున్నారు. జల వివాదంపై షర్మిల వెంటనే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరీ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలని నెరవేర్చడానికి.. రాజన్న రాజ్యం తేవడానికి వచ్చిన షర్మిల మరోసారి నిరాహార దీక్షకు దిగుతారా ? ప్రజల కోరిక తీరుస్తారా ?? అన్నది చూడాలి.  రాయలసీమ ముద్దు బిడ్డ అయిన షర్మిల.. ఇప్పుడు రాయలసీమకు నీటిని తరలించేందుకు చేపడుతున్న ప్రాజెక్టుల్ని అడ్డుకుంటామన్న ప్రకటిస్తే.. తెలంగాణ ప్రజలు నమ్మాలి. ఇదేం కర్మరా బాబూ.. !