షర్మిల ఇంటిముందు రాయలసీమ రైతులు ఆందోళన

వైఎస్ షర్మిల చాలా ఈజీగా దొరికిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంలో ఆమె ఇరుక్కుపోయింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతామని షర్మిల ఇటీవల ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరినైనా ఎదిరిస్తామని.. నీటి కేటాయింపుల్లో తెలంగాణకు ఒక్క చుక్క అన్యాయం జరిగినా సహించేది లేదంటూ ట్వీట్‌ చేశారు. ఈ ప్రకటనని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. రాయలసీమ బిడ్డ.. ఆ ప్రాంత ప్రయోజనాల కోసం కడుతున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతానని ప్రకటిస్తే తాము నమ్మాలా.. ? అని లైట్ తీసుకున్నారు.

ఇప్పుడు ఏపీ ప్రజల నుంచి షర్మిలకు నిరసన ఎదురైంది. లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ షర్మిల ఇంటిని అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలువురు రైతులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. కృష్ణా జలాల విషయంలో షర్మిల స్పష్టమైన వైఖరి తెలపాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. షర్మిల చేసిన ట్వీట్‌ రాయలసీమకు అన్యాయం చేసేలా ఉందంటూ మండిపడ్డారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయ్. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.