నిహారిక అంత భారం మోయగలదా ?
మెగా హీరోయిన్ నిహారిక రిస్క్ చేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ఒక మనసు’ సినిమాతో నిహారిక తెరకు పరిచయమైంది. ఆ సినిమా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిహారిక నటనకు అత్తెసర మార్కులే పడ్డాయి. నిహారిక రెండో సినిమాగా ‘హ్యాపీ వెడ్డింగ్’ జులై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిహారికకు జంటగా సుమంత్ అశ్విన్ నటించారు. ఈ సినిమా విడుదలకు ముందే నిహారిక పెద్ద నిర్ణయం తీసుకొంది. ఏకంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుంది.
అన్ని రకాల పాత్రలు చేసేసి. స్టార్ హీరోయిన్ అనిపించుకొని.. ఆ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమా వైపు చూస్తుంటారు హీరోయిన్స్. మెగా హీరోయిన్ నిహారిక అందుకు భిన్నంగా వెళుతుంది. ఇంకా నిహారిక హీరోయిన్ గా నిలదొక్కున్నది లేదు. ఇప్పటి వరకు ఆమె ఖాతాలో విజయమే పడలేదు. అలాంటి సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్ తో కలిసి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుంది నిహారిక.
కొత్త దర్శకురాలు సుజన దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాటోగ్రఫర్ జ్ఞానశేఖర్ ఈ సినిమాతో నిర్మాతగా వ్యవహరించనున్నారు. సోమవారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకుడు క్రిష్ .. హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వరుణ్ తేజ్ క్లాప్ ఇవ్వగా .. ముహూర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకుడిగా క్రిష్ వ్యవహరించారు. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం విశేషం.