ఆ ఆరు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపిస్తోంది. అయితే ఇలాంటి టైమ్ లో ఆరు రాష్ట్రాల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళ, అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మణిపూర్‌ రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల్లో కొవిడ్‌ కొత్త కేసుల్లో పెరుగుదల కన్పిస్తోంది.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఆయా రాష్ట్రాలకు కేంద్రం ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నతస్థాయి బృందాలను పంపించింది. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నివేదిక అందజేయాలని సూచించింది. ఈ రాష్ట్రాల్లో టెస్టింగ్, ట్రాకింగ్‌, కంటైన్మెంట్‌ చర్యలు, కొవిడ్‌ నిబంధనల అమలు, ఆసుపత్రుల్లో పడకల లభ్యత, అంబులెన్సులు, వెంటిలేటర్లు, మెడికల్‌ ఆక్సిజన్‌, కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ తదితర అంశాలను పరిశీలించి.. కేంద్రానికి నివేదిక అందజేయనుంది.