జల వివాదం.. వ్యూహాం మార్చిన కేసీఆర్ !

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. అది కాస్త విద్యుత్ వివాదంగా టర్న్ తీసుకుంది. అన్ని ప్రాజెక్టుల వద్ద పోలీసుల పహారా వరకు వెళ్లింది. మరోవైపు కృష్ణా జలాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. ఇందు కోసం ఆయన కొత్త వాదన తెరపైకి తీసుకు వచ్చారు.

కృష్ణా జలాల్లో చెరిసగం అని ఆయన వాదిస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి మరీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విశేషం. విభజన సమయంలో.. తెలుగు రాష్ట్రాల మధ్య ఓ తాత్కలిక ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేస్తారు. ఇప్పుడీ.. ఈ ఒప్పందం నుంచి బయటికి రావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల మధ్య సమానంగా నీటి పంపకాలు జరగాల్సిందేనని అంటున్నారు.

రాయలసీమకు శ్రీశైలం నీటినిపంపిణీ చేస్తున్న పోతిరెడ్డి పాడు ప్రాజెక్ట్ అక్రమం సీఎం కేసీఆర్ తేల్చేశారు. ఇందులోభాగం అంటూ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల కూడా అక్రమమేనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురనుంది.