ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ మ‌న‌స్థాపం..! సీఎం చంద్ర‌బాబుకు రాజీనామా లేఖ‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవికి డాక్టర్ పరకాల ప్రభాకర్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ప్రతిపక్ష నాయకుని వ్యాఖ్యలపై తీవ్ర మనస్తాపం చెందిన ప‌ర‌కాల త‌న ప‌ద‌వికి రాజీనామా చేవారు. గత కొన్ని రోజులుగా తనపై చేస్తున్న నిందాప్రచారంపై ఆయ‌న క‌ల‌త చెందారు. తక్షణం రాజీనామా ఆమోదించాలని లేఖలో ఆయ‌న ముఖ్యమంత్రిని కోరారు.

విపక్షానికి చెందిన కొంతమంది నాయకులు తాను ప్రభుత్వంలో సలహాదారు బాధ్యతలలో ఉండడాన్ని పదే పదే ఎత్తి చూపుతున్నారని, కేంద్రంపై, బీజేపీపై జరుగుతున్న ధర్మ పోరాటం మీద ప్రజలలో అనుమానాలు లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తున్నారని ప‌ర‌కాల లేఖ‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంలో త‌న‌ ఉనికిని, సీఎం చిత్తశుద్ధిని శంకించడానికి వాడుకుంటున్నారని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుని స్థానంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని లేవనెత్తి చంద్ర‌బాబు చేస్తున్న పోరాటాన్ని శంకించేలా మాట్లాడారని లేఖ‌లో స్ప‌ష్టం చేశారు.

త‌న‌ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలకు, రాజకీయ ప్రయోజనాలనూ, ప్రాతిపదికనూ ఆపాదించ పూనుకోవడం, వాటిని తెరవెనుక మంతనాలకు బేరసారాలకూ చంద్ర‌బాబు వినియోగిస్తారని ఆరోపించడం ప్రతిపక్ష నాయకుల నీచ స్థాయి ఆలోచనలకు తార్కాణమ‌న్నారు ప‌రకాల‌. త‌న‌ కుటుంబం లోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉండ‌టం, త‌న‌కన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందున రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీ పడతాను అని కొందరు ప్రచారం చేయడం చాలా బాధిస్తోందని లేఖ‌లో తెలియ‌జేశారు.

తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు కోసం చేపట్టిన ధర్మపోరాట దీక్షపై, సీఎం చిత్త‌శుద్ధిపై నీలినీడలు పడకూడద‌నే రాజీనామా లేఖ ఇస్తున్నాన‌ని ప‌ర‌కాల తెలిపారు. ప‌ర‌కాల ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు రాసిన పూర్తి లేఖ ఇదే..