తెలంగాణ దూకుడుని కేంద్రం కట్టడి చేస్తుందా ?
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతోంది. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ దూకుడు చూపిస్తోంది. ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైఎస్ ఆర్, సీఎం జగన్ లని ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. వారికి అదే రేంజ్ లో కౌంటర్ ఇవ్వని ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు కేంద్రాన్ని నమ్ముకున్నట్టు కనిపిపిస్తోంది.
ఇప్పటికే ఏపీ సీఎం జగన్ జల వివాదంపై రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖలు రాశారు. జల వివాదంలో కేంద్రం జ్యోక్యం చేసుకోవాలి. తమకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పుడు వైకాపా కీలక నేతలు సైతం కేంద్రానికి లేఖలు, కేంద్ర మంత్రులతో భేటీలు అవుతున్నారు.
గురువారం నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర మంత్రి షెకావత్‌ను కలిసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ నీటిని మళ్లించి విద్యుదుత్పత్తి చేసుకోవడంతో నీరు వృథా అవుతుందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ నీటి మళ్లింపును నిలిపివేయించాలని, కేంద్ర బలగాలతో ప్రాజెక్టుల వద్ద భద్రత ఏర్పాటు చేయాలని కోరారు.
తాజాగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కేఆర్ఎంబీని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్రం ఫోకస్ పెడుతుందా ? తెలంగాణ దూకుడుని కట్టడి చేస్తుందా ? ఇరు రాష్ట్రాలకు సమ న్యాయం చేస్తుందా ?? అన్నది ఆసక్తిగా మారింది.