జగన్ ఎందుకు ఢిల్లీ వెళ్లడం లేదు ?
ఏపీ సీఎం జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లకపోవడం కూడా సమస్యగా మారింది. ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్లడం లేదు ? అంటూ తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ మధ్య వారం, పదిరోజుల గ్యాప్ లోనే జగన్ రెండు సార్లు ఢిల్లీ వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో వైకాపా ఎన్డీయేలో చేరబోతుంది. దానికి ప్రతిఫలంగా వైకాపాకు రెండు కేంద్ర మంత్రి పదవులు దక్కనున్నాయనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజం కాలేదు. ప్రస్తుతం కేంద్ర కేబినేట్ లో ఏపీకి ప్రాతినిధ్యం కూడా లేదు.
ఈ విషయం పక్కనపెడితే.. సీఎం జగన్ జల వివాదంపై ఎందుకు ఢిల్లీ వెళ్లడం లేదని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి ప్రశ్నించారు. గతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి మిఠాయిలు తినిపించుకున్నారని.. జలవివాదం విషయంలో ఎందుకని సామరస్యంగా చర్చించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. తక్షణమే ముఖ్యమంత్రి దిల్లీ వెళ్లి జలవివాదంపై కేంద్ర జలశక్తిమంత్రితో చర్చించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.