దూసుకొస్తున్న సౌర తుపాను.. సెల్ ఫోన్స్ సిగ్నల్స్ కి అంతరాయం !

సౌర తుపాను ప్రమాదం పొంచి ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. శక్తిమంతమైన సౌర తుపాను ఒకటి భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు  తెలిపారు.

దీని ప్రభావం వలన భూగోళపు బాహ్య వాతావరణం వేడెక్కే అవకాశముందని.. ఫలితంగా ఉపగ్రహాలపై ప్రభావం పడి.. జీపీఎస్‌ నేవిగేషన్‌, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, శాటిలైట్‌ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడతాయన్నారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోయే ముప్పుందనీ హెచ్చరించారు.

సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుపాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో పుడమి దిశగా దూసుకొస్తోందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దాని వేగం మరింత పెరిగే అవకాశముందన్నారు. సోమవారం లోపు ఎప్పుడైనా అది మన గ్రహాన్ని తాకొచ్చని అంచనా వేశారు.