సోనూసూద్ ని కొడుతున్నారని.. టీవీ పగలకొట్టాడు !

విలన్.. హీరో అయ్యాడు. అది సినిమాలో కాదు. రియల్ గా. కరోనా టైమ్ లో బాలీవుడ్ నటుడు సోనూసూద్ చేసిన కార్యక్రమాలు.. ఆయన్ని రియల్ హీరో చేశాయి. ఆయన్ని కనిపించే దేవుడుగా పిలుచుకుంటున్నారు. ఇక సినిమాల్లో సోనూసోద్ విలన్ గా కనిపిస్తే ప్రేక్షకులు తట్టుకొనేలా లేరు. కొత్త సినిమాల సంగతి పక్కనపెడితే.. పాత సినిమాల్లోనూ ఆయన్ని విలన్ గా చూడలేకపోతున్నారు. సోనూసూద్‌ను సినిమాలో హీరో కొడుతుండటంతో తట్టుకోలేక ఏడేళ్ల్ల బాలుడు టీవీని పగలగొట్టిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం వేపలసింగారానికి చెందిన చడపంగు గురవయ్య, పుష్పలత తమ కుమారుడు విరాట్‌తో కలిసి శుభకార్యానికి హాజరయ్యేందుకు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌ గ్రామానికి వచ్చారు. కుటుంబ సభ్యులందరు కలిసి టీవీలో సినిమా చూస్తున్నారు. ఆ సినిమాలో విలన్‌గా సోనూసూద్‌ కనిపించారు. విలన్‌ పాత్రలో ఉన్న సోనూసూద్‌ను హీరో కొట్టడంతో కోపానికి గురైన విరాట్‌ అందుబాటులో ఉన్న రాయి విసరడంతో టీవీ పగిలిపోయింది. ఈ విషయాన్ని సోనూసూద్‌ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్ అవుతోంది.