‘మా’ ఎన్నికలు : బాలయ్య సీక్రెట్ సూచనలు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల హీట్ మూడ్నెళ్ల ముందే మొదలై.. ప్రస్తుతానికి కాస్త చల్లారింది. కానీ చర్చ మాత్రం సాగుతోంది. మా ఎన్నికలపై పలువురు సినీ ప్రముఖులు అభిప్రాయాలు చెబుతున్నారు. కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా హీరో బాలకృష్ణ మా ఎన్నికలపై మాట్లాడారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా’ ఎన్నికలు, శాశ్వత భవనంతోపాటు మరికొన్ని అంశాల గురించి ప్రస్తావించారు.

గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ… ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారని బాలయ్య సూటిగా ప్రశ్నించారు. ‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని మరో ప్రశ్న వేశారు బాలయ్య. తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారని ఎద్దేవా చేశారు. ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోను అన్నారు. 

‘మా’ శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయంపై స్పందిస్తూ.. అందులో నేను భాగస్వామినవుతా అన్నారు. అంతేకాదు.. ఇది గ్లామర్ పరిశ్రమ. మన సమస్యలని బహిరంగంగా చర్చించకూడదని బాలయ్య సూచించారు. మా ఎన్నికలు, సినీ పెద్దల తీరుపై అప్పుడప్పుడు బాహాటంగానే అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసే బాలయ్య.. సీక్రెట్ గా మాట్లాడుకోవాలని సూచనలు చేయడం కొసమెరుపు.