శ్రీరాంసాగర్‌ 8 గేట్లు ఎత్తివేత

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీరాంసాగర్‌ జలాశయానికి (ఎస్సార్‌ఎస్పీ) భారీగా వరద ప్రవాహం పోటెత్తుతోంది. జలాశయంలోకి ప్రస్తుతం 2,88,325 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 81.696 టీఎంసీలుగా ఉంది.

ఈ నేపథ్యంలో ఎస్సార్‌ఎస్పీ 8 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేశారు. పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ మండలంలో 23.65 సె.మీ వర్షం కురిసింది. కడెం నారాయణ రెడ్డి జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద వస్తుండటంతో 10 గేట్లను ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. సూర్యాపేట జిల్లాలోని మూసీ జలాశయానికి భారీ వరద వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 3,369 క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 9,072 క్యూసెక్కులుగా ఉంది.