అనుభవం లేని వాళ్లు పాదయాత్రలు చేస్తున్నారు….!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. ఇటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తూనే అటు ప్రతిపక్ష పార్టీలపై ఓ రేంజ్ లో విరుచుకు పడ్డారు. ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలో మూడో విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో వైసీపీ నేత జగన్ కు చురకలు వేశారు సీఎం. 388 జీవో ప్రకారం 9054 మందికి పట్టాలు పంపిణీ చేశామని, దీని విలువ 2220 కోట్ల రూపాయలని చెప్పారు చంద్రబాబు.
ఇప్పటివరకు ఒక్క విశాఖ జిల్లాలో 60,965 మందికి సుమారుగా 11 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అందించామని, భూమిని సేకరించి పేదవాళ్లకి ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎస్టీలకు అన్యాయం జరగకుండా మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చడం, రజకులను, వడ్డెరలను ఎస్సీ లో చేర్చుతామని ఆయన హామీ ఇచ్చారు. విశాఖ జిల్లాలో 25 అన్న క్యాంటిన్లు ప్రారంభిస్తున్నామన్నారు. త్వరలోనే నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పారు.
అనుభవం లేని వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారని, ఎప్పుడు ఏమీ చేయలేని వాళ్లు, చేతకాని వాళ్లు తనను విమర్శిస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబు. కొత్తగా వచ్చిన వాళ్లు కూడా తమను విమర్శిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షం అభివృద్ధిని అడ్డుకుంటుందని తెలిపారు. విశాఖలో 1600 ఎకరాల్లో గచ్చిబౌలి తరహాలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామన్నారు.