కథే ప్రధానంగా మా ప్రయాణం
కథే ప్రధానంగా ప్రయాణం చేస్తున్నాం అన్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. 70 ఎమ్.ఎమ్.ఎంటర్టైన్మెంట్ పతాకంపై వరుసగా సినిమాలు నిర్మిస్తోంది ఈ ద్వయం. ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’… ఇలా వరుసగా విజయాలే. ఇటీవల సుధీర్‌బాబు కథానాయకుడిగా కరుణకుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడాసెంటర్’ నిర్మించారు. ఆ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాతలు విలేకర్లతో ముచ్చటించారు. కథే ముఖ్యం. కథ తర్వాతే వ్యాపారం గురించి ఆలోచిస్తాం. ఒక్కసారి స్క్రిప్టు నచ్చిందంటే మా కొత్త సినిమా ప్రయాణం మొదలైనట్టే అన్నారు. ‘ఆనందో బ్రహ్మ’ తర్వాత చాలా మంది దర్శకులు హారర్ కామెడీ కథలతో వచ్చారు. కానీ అవేవీ ‘ఆనందో బ్రహ్మ’కంటే బాగున్నట్టు అనిపించలేదు. ‘యాత్ర’ తర్వాత జీవిత కథలతో వచ్చారు. కానీ నచ్చలేదు. ‘శ్రీదేవి సోడాసెంటర్’ కథ నచ్చడంతో వెంటనే మొదలుపెట్టాం. ‘వాస్తవికత ఉట్టిపడే కథతో ‘శ్రీదేవి సోడాసెంటర్’ రూపొందింది. దర్శకుడు కరుణకుమార్ తీసిన ‘పలాస’ ఒక ‘రా’ వాతావరణాన్ని ఆవిష్కరించింది. ఇది అందుకు భిన్నంగా సాగుతుంది. పూర్తిగా ఓ పల్లెటూరి నేపథ్యంతో కూడిన కథ అని చెప్పుకొచ్చారు.