పంజ్‌షేర్ కోటకు బీటలు !
అఫ్గానిస్థాన్ యావత్తూ తాలిబన్ల వశం కానుందా ? పంజ్‌షేర్ కోటకు బీటలు వారుతున్నాయా ? ఆ ప్రాంత అధినేత అహ్మద్ మసూద్ తలవంచనున్నాడా ?? అంటే అవుననే అంటున్నారు. పోరాటానికి తగిన వనరులు అందుబాటులో లేక, అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం అందక.. తాలిబన్లకు లొంగిపోయే దిశగా మసూద్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
అమెరికా, నాటో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో ఇటీవల మళ్లీ విజృంభించిన తాలిబన్లు అఫ్గాన్ మొత్తాన్నీ ఆక్రమించుకున్నారు.. ఒక్క పంజ్‌షేర్‌ను తప్ప. పోరాటాలకు పెట్టింది పేరైన ఈ ప్రావిన్సు ప్రస్తుతం అహ్మద్ మసూద్ నాయకత్వంలో ఉంది. తాలిబన్ల విజృంభణ అనంతరం అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ సహా గత ప్రభుత్వంలోని పలువురు నేతలు పంజ్‌షేర్‌కే వచ్చేశారు. తాలిబన్లపై సాయుధ పోరుకు వారు ఇక్కడి నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ.. ఈ ప్రాంతం కూడా తాలిబన్లకు లొంగిపోనుందని తెలుస్తోంది.