మంత్రి గంగులకు ఫేక్ ఈడీ నోటీసులు
తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కొద్దిలో సైబర్ నేరగాళ్ల బారి నుండి తప్పించుకున్నారు. ఆయనకు ఇటీవల ఈడీ పేరిట నోటీసులు అందాయి. అదే సమయంలో రూ. కోటీ ఇస్తే వదిలేస్తామనే ప్రపోజల్ కూడా వారి నుంచి వచ్చింది. దీనిపై అనుమానం వచ్చిన మంత్రి గంగుల ఈడీ అధికారులని సంప్రదించగా.. తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో తనకు వచ్చిన ఈడీ నోటీసులు ఫేక్ అని మంత్రి గంగులకు క్లారిటీ వచ్చింది. దీనిపై మంత్రి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు తమ పేరుతో సైబర్ నేరగాళ్లు మంత్రికే నోటీసులు ఇవ్వడాన్ని ఈడీ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. దీంతో ఈ ఘటనపై విచారణ జరపాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఈడీ అధికారులు ఆదేశించారు. ఇటీవలే మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరా చేసుకొని మంత్రికే టోకరా వేద్దామని సైబర్ నేరగాళ్లు ప్లాన్ రచించినట్టు అర్థమవుతోంది.