బిగ్‌బాస్‌ విన్నర్‌ కన్నుమూత

బాలీవుడ్‌ నటుడు, బిగ్‌బాస్‌-13 సీజన్‌ విజేత సిద్దార్థ్‌ శుక్లా (40) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన్ని కుటుంబసభ్యులు వెంటనే ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు ధృవీకరించారు. సిద్ధార్థ్‌ ఆకస్మిక మరణంతో బాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు వరుస ట్వీట్లు చేస్తున్నారు. అశోక్‌-రీతా శుక్లా దంపతులకు 1980 డిసెంబర్‌ 12న సిద్దార్థ్‌ జన్మించారు. ఇంటీరియర్‌ డిజైన్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆయన సినిమాలపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

బుల్లితెర స్టార్ ఎదిగిన సిద్దార్థ్ శుక్లా.. బాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో సహాయ నటుడిగా సిద్దార్థ్‌ నటించారు. ‘బాలికా వధు’, ‘దిల్‌ సే దిల్‌ తఖ్‌’ ధారావాహికలతో ఆయన బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘బిగ్‌బాస్‌-13’ అనంతరం ఆయన చివరిగా కనిపించిన షో ‘బ్రోకన్‌ బట్‌ బ్యూటీఫుల్‌ 3’.