మరో నిర్భయ ఘటన.. ఇనుపరాడ్డుతో కొట్టి అత్యాచారం !
2012లో దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువతిపై కొందరు మృగాళ్లు ఇలాంటి లైంగిక దాడికే పాల్పడ్డారు. కదులుతున్న బస్సులో ఆమెపై అత్యాచారం చేసి తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటనలో ప్రాణాలతో పోరాడుతూ కొద్ది రోజుల తర్వాత ఆ యువతి మరణించింది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబయి మహానగరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
ఒంటరిగా ఉన్న 34ఏళ్ల మహిళపై కొందరు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి, బాధితురాలి రహస్య అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. సాకినాక శివారు ప్రాంతంలోని ఖైరానీ రోడ్డు వద్ద మహిళపై దాడి జరిగిందని సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడకు చేరుకునే సరికి ఆ మహిళ రోడ్డుపైనే రక్తపు మడుగులో కన్పించింది. దీంతో వెంటనే ఆమెను ఘాట్కోపర్లోని రాజవాడి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావమైన మహిళ.. చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయగా.. మరికొందరు కోసం గాలిస్తున్నారు.