టీఆర్ఎస్ లోకి దానం నాగేందర్..!? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా..!
మాజీ మంత్రి కాంగ్రెస్ నేత దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన్ను కొన్నాళ్ల క్రితం ఆ బాధ్యతలనుంచి తప్పించడం, తన బాధ్యతలను మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కు అప్పగించడం చకచకా జరిగిపోయాయి. జరుగుతున్న పరిణామాలన్నీ తనను పార్టీ పట్టించుకోవడంలేదనే భావన దానంలో కలిగినట్లుగా తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కి దానం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాహుల్ గాంధీ, అశోక్ గేహలాట్, ఉత్తమ్ కుమార్ కు రాజీనామా లేఖను పంపారు. ఆయన త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.
దానం పార్టీ వీడటంపై పార్టీ నేతల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన పార్టీ వీడటం కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ లేదనే అభిప్రాయాన్ని సొంతపార్టీ నేతలే వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిదని, పాత నీరు పోతది కొత్త నీరు వస్తూ ఉంటది అంటూ మాట్లాడుకుంటున్నారట. కాంగ్రెస్ ను వీడిన వారి పరిస్థితి ఇప్పుడు ఏమైందో వెళ్లే వాళ్లు గుర్తుంచుకోవాలంటూ చురకలు వేస్తున్నారట కూడా.
పార్టీలో ఉన్నప్పుడు పలుకుబడి సంపాదించుకుని, పార్టీ అధికారం కోల్పోయిన తరువాత అధికారం కోసం ఇతర పార్టీలకు వెళ్ళడం నీతిమాలిన చర్యగా అభివర్ణిస్తున్నారు మరికొంత మంది. నేతలు వెళ్లినంతమాత్రాన పార్టీకి ఒరిగేదేం లేదని, కొత్త వారికి అవకాశాలు వస్తాయని పార్టీలో మరికొంత మంది ఆశావహులు అభిప్రాయపడుతున్నారు. గతంలో దానం తెలుగుదేశం పార్టీకి వెళ్లి తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందేనని, దానం సమస్యను కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని పార్టీలో టాక్ వినిపిస్తోంది..