నిమజ్జనంపై సుప్రీంకు తెలంగాణ ప్రభుత్వం
గణేష్ నిమజ్జనంపై ఇచ్చిన తీర్పులోని అంశాలను సవరించాలన్న ప్రభుత్వ విజ్ఞప్తికి హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు తీర్పు, తదుపరి కార్యాచరణ, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చించారు. వేలాది విగ్రహాలు, భక్తుల మనోభావాలు, ప్రస్తుత పరిస్థితులు, తదితర అంశాల దృష్ట్యా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు అప్పీల్‌కు వెళ్లాలని సమీక్షలో నిర్ణయించినట్లు సమాచారం.
వాస్తవ పరిస్థితులను సుప్రీం దృష్టికి తీసుకెళ్లాలని.. నిమజ్జనానికి అనుమతి కోరాలన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేయనుంది. సుప్రీ కోర్టులోను చుక్కెదురు అయితే తెలంగాణ ప్రభుత్వం ఏం చేయనుంది ? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
హైకోర్టు విధించిన ఆంక్షలు ఏంటీ ?
ట్యాంక్‌బండ్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం హైకోర్టు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. హుస్సెన్‌సాగర్‌లో నీరు కలుషితం కాకుండా ఉండాలంటే.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని చెప్పింది. ఈ రకమైన విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ప్రత్యేక కుంటలు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దూర ప్రాంతాల నుంచి నిమజ్జనాల కోసం ఒకే రోజు హుస్సేన్ సాగర్‌కు రాకుండా ప్రణాళికలు ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. చిన్న విగ్రహాలను ఇళ్లలోనే బకెట్లలో నిమజ్జనం చేసేలా ప్రోత్సహించాలని తెలిపింది. నిమజ్జనం రోజున ఉచితంగా మాస్కులు అందించాలని చెప్పింది. నిమజ్జనం తర్వాత వెంటనే డెబ్రీస్ తొలగించాలని ఆదేశించింది.