నేరాలు, ఘోరాల్లో ఏపీ టాప్

దేశంలో అతి పెద్ద రాష్ట్రాల్లో జరగనన్ని నేరాలు, ఘోరాలు ఏపీలో జరుగుతున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించినట్లయింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2019తో పోలిస్తే 2020లో నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 63శాతం మేర పెరిగాయంటే మామూలు విషయం కాదు. జాతీయ స్థాయిలోనూ పెరిగాయి.అయితే ఆ సగటు 23 శాతం మాత్రమే ఉంది. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో ఈ నివేదిక వెలుగులోకి రావడం చర్చనీయాంశం అవుతోంది.

2019లో ఏపీలో 1 లక్షా 45, 751 కేసులు నమోదయ్యాయి. అదే 2020లో ఈ కేసుల సంఖ్య 2 లక్షల 38వేల 105కి చేరింది. అంటే దాదాపుగా ఒక్క ఏడాదిలోనే లక్ష కేసులు అదనంగా నమోదయ్యాయి. స్థానిక చట్టాలపై నమోదైన కేసులను తీసేసి.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసులను చూసినా 58 శాతానికిపైగా కేసుల నమోదు ఉంది. ఇది దేశంలో అత్యధిక వృద్ధి. దేశంలో అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో 2019లో ఏపీ 12వ స్థానంలో ఉండేది. ఈ ఏడాది మూడు స్థానాలు పెరిగి 9వ స్థానానికి వచ్చింది. స్వర్ణాంధ్రప్రదేష్ కాస్త నేరాంధ్రపదేష్ గా మారిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.