సోనూసూద్ ఇంటిపై ఐటీ సోదాలు.. మంచి పనులు చేస్తే అంతే మరీ..!

మంచి చేసిన ఓర్వలేని రాజకీయ వ్యవస్థ మనది. కరోనా విజృంభిస్తున్న సమయంలో కనిపించే దేవుడు అయ్యాడు నటుడు సోనూసూద్. అడిగినవారికి, అడగనివారిని ఆదుకున్నాడు. తన స్థోమతని మరచి అప్పులు తెచ్చి.. బ్యాంకు లోన్లు తెచ్చి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అలాంటి సోనూసూద్ ని మహారాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు కనబడుతుంది. సోనూసూద్‌ నివాసం, కార్యాలయాల్లో బుధవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 

పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి, లఖ్‌నవూ నగరాల్లోని సూద్‌కు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిపామని అధికారులు తెలిపారు. ”లఖ్‌నవూలోని ఓ స్థిరాస్తి సంస్థతో సూద్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి. అందుకే ఈ సర్వే ఆపరేషన్‌ నిర్వహించాం” అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు. ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఆ సమయంలో ఆప్‌ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి. ఇదే ఆయన్ని మహారాష్ట్ర సర్కారు టార్గెట్ చేయడానికి కారణమనే ప్రచారం జరుగుతుంది.