టీఆర్ఎస్ యాక్షన్ కు కాంగ్రెస్ రియాక్షన్…!?
టీఆర్ఎస్ ఆకర్ష్ తో కాంగ్రెస్ లో నెలకొన్న గందరగోళానికి తెలరదించే ప్రయత్నంలో పడింది తెలంగాణ కాంగ్రెస్.. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే దానం నాగేందర్ టీఆర్ఎస్ లో చేరిపోతుండటం, ముఖేష్ కూడా దానంబాటలోనే నడుస్తుండటం చకచకా జరిగిపోతున్నాయి. పార్టీకి వారితో ఎంతమేరకు ఉపయోగం అనేది పక్కనబెడితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం కొంత గందరగోళ పరిస్థితిని సృష్టించింది.
ఒకవైపు టీకాంగ్రెస్ నేతలు కొంతమంది రాహుల్ ను కలవడం, పీసీసీ వ్యవహార శైలిపై ఫిర్యాదులు చేయడం, మరికొందరు పీసీసీ మారడం ఖాయమంటూ లీకులివ్వడం కాంగ్రెస్ శ్రేణులను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టాయి. అదీగాక నేతల వలసలు కూడా వారిలో కొంత అధైర్యానికి కారణమవుతున్నాయి. దానం నాగేందర్ లాంటి నాయకుల చేరిక టీఆర్ఎస్ కు ఇప్పటికిప్పుడు అవసరం లేకపోయినప్పటికీ కాంగ్రెస్ ను నెర్వెస్ చేసేందుకు మాత్రం టీఆర్ఎస్ స్ట్రాటజిక్ గా ముందుకెళుతున్నట్లు చెప్పొచ్చు. ఆ దిశగా అధికార పార్టీ సక్సెస్ అయ్యింది కూడా.
టీఆర్ఎస్ గేమ్ కు, సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఒకే సారి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ రియాక్షన్ ఇచ్చింది. టీపీసీసీలో మార్పులేదని, ఉత్తమే పీసీసీగా కొనసాగుతారంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి కుంతియా కుండబద్దలు కొట్టేయటం వ్యూహాత్మకంగానే జరిగిందనేది విశ్లేషకుల మాట. ఎవరికైనా అభ్యంతరాలుంటే రాహుల్ కు ఫిర్యాదు చేయవచ్చంటూ ఖరాఖండిగా చెప్పడంతో పార్టీలో నెలకొంటున్నగందరగోళానికి తెరతీసినట్లయింది. వెళ్లాలనుకున్నవారిని ఆపలేమంటూ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది కూడా.
పార్టీ శ్రేణుల్లో పీసీసీపై క్లారిటీ ఇవ్వడం, వెళ్లే వారిపై ఓ సెటైర్ వేయడంతో పార్టీ కార్యకర్తల్లో కొత్త జోష్ ను నింపినట్లయింది. డిసెంబరులో ఎన్నికలకు సిద్ధమంటూ ప్రకటించడం అధికార పార్టీకి తాము స్ట్రాంగ్ గానే ఉన్నామన్న మెసేజ్ ఇవ్వడంతో పాటు ఎన్ని వలసలున్నా తమ టీం రెడీగా ఉందనే ధీమాను కార్యకర్తల్లో నింపడంలో కాంగ్రెస్ రియాక్షన్ లో భాగమంటున్నారు చాలామంది. మొత్తంగా టీఆర్ఎస్ స్ట్రాటజీకి టీకాంగ్రెస్ కౌంటర్ ఇస్తోందని చెప్పుకోవచ్చు. మరి ఎన్నికల నాటికి ఎలాంటి పరిణామాలు జరుగుతాయి… ఎవరి బలాబలాలు ఎలా మారతాయో చూడాలి..