సై అంటే సై…!!
తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య సవాల్ లు, ప్రతిసవాల్ లు యుద్ధవాతావరణాన్ని తలపిస్తోంది. నువ్వా, నేనా అంటూ ఎన్నికల రణరంగానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి దానం చేరిక సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్ష కాంగ్రెస్ కు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సాధారణ ఎన్నికల బదులు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది.
ముందస్తుకు సిద్ధమా అంటూ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకీ సవాల్ విసరడంతో సవాల్ ను స్వీకరించింది కాంగ్రెస్. ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము సిద్ధమేనని, అవినీతి, అసంబద్ధ టీఆర్ఎస్ ను ప్రజలు బుద్ధి చెబుతారంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రజలను త్వరలోనే విముక్తి చేస్తామంటూ ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అధికార, విపక్ష సవాళ్లతో తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. ఇక తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనేది ఇంకా ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఆశావహులు కొందరు ఏ పార్టీలోకి వెళితే తమకు అన్నివిధాలా మేలు జరుగుతుందంటూ బేరీజు వేసుకుంటున్నారు. మరో వైపు మరి కొద్దిరోజుల్లో ఇంకా చాలా మంది టీఆర్ఎస్ లో చేరబోతున్నారంటూ సీఎం ప్రకటించడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో నుంచి ఇంకా ఎవరెవరు చేరతారనే చర్చ మొదలైంది. ఉత్తమ్ వైఖరి నచ్చక దూరంగా ఉండేవారిని టీఆర్ఎస్ టార్గెట్ గా పెట్టుకుని పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉత్తమ్ కూడా ఇవేవీ పట్టించుకోకుండా అధికార పార్టీకి గట్టి సవాలే విసురుతున్నారు. తామెప్పుడైనా ఎన్నికలకు సిద్ధమని అంతే వాయిస్ తో సమాధానం చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలకు సై అంటే సై అంటూ సిద్ధమవుతున్నారు. ఇక ముందు ముందు అధికార టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందో.. విపక్ష కాంగ్రెస్ ఏవిధంగా అధికార పార్టీని ఎదుర్కొంటుందో చూడాలి మరి.